Trapped by Amendments: How Land Acquisition Laws Undermine Citizen Rights

Back to Blog

Trapped by Amendments: How Land Acquisition Laws Undermine Citizen Rights

చట్టాల ఉచ్చులో పౌరుల భూసేకరణ హక్కులు!

భారతదేశంలో ఒక వ్యవసాయ కుటుంబానికి భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు వారి ఆత్మగౌరవ ప్రతీక. అందుకే రైతు తన భూమిని కంటికి రెప్పలా చూసుకుంటూ, దానితో ఒక ఆత్మీయ, సంస్కృతీ, సాంప్రదాయాలతో  కూడుకున్న అనుబంధాన్ని పెంచుకుంటాడు. 

ఒక రైతు పొలంలో నాటు వేస్తున్నాడంటే లేదా నాగలి పట్టి సాగు చేస్తున్నాడంటే అది కేవలం ఆ ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం కాదు, ఆ ఒక్క ఎకరం నేల చుట్టూ ఒక ఇరుసులా తిరిగే సమగ్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం. 

పొలంలో రెక్కలు ముక్కలు చేసుకునే రోజువారీ వ్యవసాయ కూలీలు, ఆధునిక యంత్రాలతో పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్లు, హార్వెస్టర్ నిర్వాహకులు ఒకవైపు అయితే… విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అమ్మే స్థానిక వ్యాపారులు, వ్యవసాయ పనిముట్లు అందించే మెకానిక్‌లు, చివరకు ఆ పంటను మార్కెట్‌కు చేర్చే రవాణాదారులు మరోవైపు. ఇలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పదుల సంఖ్యలో కుటుంబాలు ఆ ఒక్క పొలంపైనే ఆధారపడి పొట్ట నింపుకుంటారు. 

అటువంటి భూమిని అభివృద్ధి పేరిట ఏకపక్షంగా (SIA – Social Impact Assessment – సామాజిక ప్రభావ అంచనా ని రద్దు చేసి విచారణ లేకుండా )  స్వాధీనపరచుకున్నప్పుడు,  కేవలం రైతు పట్టా కాగితం మాత్రమే రద్దవ్వదు, ఆ భూమిపై చిరునవ్వులతో బతికే ఒక చిన్న సైన్యం ఉపాధి గాలిలో కలిసిపోతుంది!

ఇలాంటి అత్యంత సున్నితమైన విషయాల్లో ప్రభుత్వాలు చాలా సూక్ష్మదృష్టితో, దూరదృష్టితో ఆలోచించాల్సింది పోయి అభివృద్ధి పేరిట వినాశనానికి దారితీసే చట్టపరమైన సవరణలను, పద్ధతులను తీసుకొచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు తప్పవు. అప్పుడు అసలు ‘అభివృద్ధి’ అనే మాటకే అర్ధం లేకుండా పోతుంది. ఎందుకంటే అభివృద్ధి అంటే కేవలం ఫ్యాక్టరీలను స్థాపించడం, నగరాల్లో కాంక్రీట్ జంగళ్లను సృష్టించి, పెద్ద పెద్ద రవాణా సౌకర్యాలను కల్పించడం మాత్రమే కాదు! అక్కడి ప్రాంత ప్రజలకు, వారి జీవన విధానానికి తగ్గట్టు అన్ని విధాలా సమతుల్యమైన అవసరాలను తీర్చగలిగినప్పుడు మాత్రమే అది నిజమైన ‘సుస్థిరాభివృద్ధి’ (Sustainable Development) అవుతుంది. ఒకరి కడుపు కొట్టి, ఒక ఊరి ఉపాధిని దెబ్బతీసి, కాంక్రీట్ రోడ్లు వేస్తే అది ప్రగతి అనిపించుకోదు; అది కేవలం విధ్వంసం మాత్రమే అవుతుంది!

సామాజిక ప్రభావ అంచనా (Social Impact Assessment – SIA ) అంటే ఏమిటో తెలుసుకుందాం!

ఒక ప్రాజెక్టు వల్ల ఊరు ఎంత నష్టపోతుంది? ఎంతమంది కూలీలు వీధిలో పడతారు? అసలు అక్కడ ప్రాజెక్టుకు అంత భూమి అవసరమా? అని తదితర ముఖ్యమైన అంశాలను లెక్కగట్టే ఏకైక ప్రజాస్వామ్య సాధనం ‘సామాజిక ప్రభావ అంచనా’ (Social Impact Assessment – SIA)

సామాజిక ప్రభావ అంచనా అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో తయారయ్యే కాగితాల నివేదిక కాదు; భూమిని నమ్ముకుని బతుకుతున్న మనుషుల జీవితాల దృశ్యరూపం! 

ఒక ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట ప్రభుత్వం అడిగినంత భూమిని ఇవ్వకుండా, నిజంగా అక్కడ అవసరమైన అత్యంత కనీస భూమి (Bare Minimum) ఎంత? ప్రత్యామ్నాయంగా బంజరు భూములు ఉన్నాయా? అని స్వతంత్ర నిపుణులు సర్వే చేస్తారు. అంతేకాదు, భూమి లేకపోయినా ఆ పొలంపై ఆధారపడి పొట్ట నింపుకునే కౌలు రైతులు, రోజువారీ కూలీలు, చేతివృత్తుల వారిని గుండెకు హత్తుకుని, వారి నష్టాన్ని గుర్తించే ప్రజాస్వామ్య కవచం. 

చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక ప్రాంతంలోని ప్రభుత్వం భూములు సేకరిస్తుంది అంటే  అక్కడ భూమిపై ప్రత్యక్షంగా ఆధారపడినటువంటి వారినే కాకుండా  పరోక్షంగా ఆధారపడేటటువంటి వారిని కూడా నష్ట పరిహార జాబితాలో చేర్చడం అనేది కీలకమైన విషయం. 

2013 కేంద్ర చట్టం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పలు చారిత్రాత్మక తీర్పుల్లో స్పష్టం చేసింది—భూసేకరణ జరిగేటప్పుడు కేవలం భూమి యజమానులకే కాకుండా, ఆ ప్రదేశంలో టీ కొట్లు, చిన్న దుకాణాలు నడుపుకునే భూమి లేని పరోక్ష వ్యాపారులకు కూడా పరిహారం మరియు పునరావాసం అందించడం వారి రాజ్యాంగబద్ధమైన హక్కు (Article 21). కానీ విషాదమేమిటంటే… తెలంగాణ సవరణ చట్టంలోని సెక్షన్ 10A ద్వారా SIA అధ్యయనాన్నే రద్దు చేయడంతో, సుప్రీంకోర్టు కల్పించిన ఈ రక్షణ కవచం నుండి ఈ చిన్న వ్యాపారులు, పేదలు పూర్తిగా దూరమైపోతున్నారు!

తెలంగాణ భూసేకరణ సవరణ చట్టం (Act 21 of 2017) ద్వారా 2013 కేంద్ర చట్టంలో చేసిన కీలక మార్పులు. 

2013 నాటి కేంద్ర భూసేకరణ చట్టం పౌరులకు, రైతులకు అనేక రక్షణలు కల్పించింది. కానీ, అప్పటి ప్రభుత్వం ‘రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహ్యాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (తెలంగాణ అమెండ్మెంట్) యాక్ట్, 2016’ తెచ్చి, మే 17, 2017న గెజెట్ ద్వారా అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధమైన ప్రజల హక్కులకు తీవ్ర విఘాతం కలిగించారు.

  1. 2013 కేంద్ర చట్టం ప్రకారం పబ్లిక్-ప్రైవేట్ (PPP) ప్రాజెక్టులకు భూమి సేకరించాలంటే 70% మంది రైతుల సమ్మతి, ప్రైవేట్ సంస్థలకు అయితే 80% మంది రైతుల సమ్మతి తప్పనిసరి. కానీ తెలంగాణ సవరణ చట్టంలోని సెక్షన్ 2 ద్వారా సెక్షన్ 10A కిందకి వచ్చే ప్రాజెక్టులన్నింటికీ ఈ ‘రైతుల సమ్మతి’ నిబంధన నుండి ప్రభుత్వానికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. అంటే రైతుల అనుమతి లేకుండానే భూమిని లాక్కునే వెసులుబాటు కల్పించారు.
  2. నూతనంగా చేర్చిన చాప్టర్ III A (సెక్షన్ 10A) ప్రకారం ఇరిగేషన్, పారిశ్రామిక కారిడార్లు, రహదారులు, విద్యుత్, ఇళ్ల స్థలాలు మరియు PPP ప్రాజెక్టుల పేరిట భూసేకరణ చేసేటప్పుడు ‘సామాజిక ప్రభావ అంచనా’ (SIA) వేయడం నుండి మినహాయింపు కల్పించారు. ఫలితంగా ఆ భూమిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి బతుకుతున్న కౌలు రైతులు, రోజువారీ కూలీలు మరియు చిన్న వ్యాపారుల ఉనికినే రికార్డుల నుంచి తుడిచేసి వారికి పరిహారం దక్కకుండా చేశారు.
  3. 2013 కేంద్ర చట్టంలోని సమగ్ర పునరావాస మరియు పునర్నిర్మాణ (Rehabilitation and Resettlement) ప్రక్రియకు భిన్నంగా, బాధితులకు ఒకేసారి ఒక నిర్ణీత మొత్తాన్ని (Lump-sum amount) ఇచ్చి ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకునేలా సెక్షన్ 31A ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉపాధి కోల్పోయిన భూమి లేని పేదలకు శాశ్వత పునరావాసం దక్కకుండా పోయింది.
  4. కేంద్ర చట్టంలో సేకరణ చేసిన భూమిని 5 ఏళ్లలో ప్రాజెక్ట్ కోసం ఉపయోగించకపోతే తిరిగి అసలు యజమానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, తెలంగాణ సవరణలో దీనిని “ప్రాజెక్ట్ కాలపరిమితి లేదా 5 ఏళ్లు… ఏది ఎక్కువైతే అది” అని మార్చారు. దీనివల్ల సేకరించిన భూములను ప్రభుత్వం ఎంతకాలమైనా ఉపయోగించకుండా తమ ఆధీనంలోనే ఉంచుకునే లొసుగు ఏర్పడింది.
  5. భూసేకరణ ప్రక్రియలో అధికారులు అక్రమాలకు పాల్పడినా, చట్టాన్ని ఉల్లంఘించినా CrPC సెక్షన్ 197 కింద ప్రభుత్వ ముందస్తు పూర్వానుమతి ఉంటేనే కోర్టులు వారిపై విచారణ చేపట్టేలా వెసులుబాటు తెచ్చారు. దీనితో బాధిత పౌరులు (Project Affected Citizens). అక్రమాలకు పాల్పడిన అధికారులపై నేరుగా న్యాయపోరాటం చేసే హక్కు బలహీనపడింది.

సామాజిక ప్రభావ అంచనా’ (SIA – Social Impact Assessment) అనేది ఎందుకు ముఖ్యం? 

2013 కేంద్ర భూసేకరణ చట్టంలో రాజ్యాంగబద్ధంగా తెచ్చిన అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ‘సామాజిక ప్రభావ అంచనా’ (SIA). ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రక్రియ మాత్రమే కాదు; ఒక ప్రాంతంలో భూసేకరణ వల్ల జరిగే సామాజిక, ఆర్థిక, మానవీయ నష్టాలను బేరీజు వేసే ఒక సాధనం.

  1. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూమి నిజంగా ప్రజా ప్రయోజనం కోసమేనా? అసలు ఆ ప్రాజెక్టు అక్కడ అవసరమా? అనే ప్రాథమిక విచారణ జరుగుతుంది.
  2. ప్రభుత్వం అడిగినంత భూమిని ఇవ్వడానికి వీల్లేదు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అత్యంత కనీస భూమి (Bare Minimum) ఎంత అవసరమో స్వతంత్ర నిపుణుల కమిటీ సమగ్రంగా సర్వే చేసి నిర్ధారిస్తుంది.
  3. సాగులో ఉన్న సారవంతమైన బహుళ పంటల భూములను తీసుకోకుండా, దగ్గరలో ఏవైనా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బంజరు భూములు లేదా ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఉన్నాయా అనే విషయాన్ని అధ్యయనం చేయాలి.
  4. SIA అధ్యయనం కేవలం భూమి ఉన్న పట్టాదారుల వివరాలు మాత్రమే సేకరించదు. ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలు, కౌలు రైతులు, చేతివృత్తుల వారు, మరియు స్థానిక వ్యాపారుల వివరాలను లెక్కించి, వారందరినీ “బాధిత కుటుంబాలుగా” (Project Affected Families) గుర్తించి పరిహార జాబితాలో చేరుస్తుంది.
  5. SIA బృందం స్థానిక గ్రామంలో బహిరంగ విచారణ (Jan Sunwai / Public Hearing) నిర్వహించి, డ్రాఫ్ట్ నివేదికను ప్రజల ముందుకు తెస్తుంది. దీని వీడియో రికార్డింగ్‌తో పాటు నివేదికను స్థానిక భాషలో పంచాయతీ ఆఫీసులలో అందుబాటులో ఉంచాలి. దీని ఆధారంగానే 70% – 80% మంది రైతుల సమ్మతి పొందే ప్రక్రియ నడుస్తుంది.
  6. SIA లేకపోవడం వల్ల “మాకు ఈ భూమి తప్ప వేరే జీవనాధారం లేదు” అని రైతులు ప్రభుత్వం ముందు తమ అభ్యంతరాలను చెప్పే అధికారిక వేదిక లేకుండా పోయింది.
  7. SIA సర్వే జరగకపోతే కేవలం పట్టాదారులకు మాత్రమే ప్రభుత్వం అరకొర డబ్బు ఇచ్చి పంపుతుంది. భూమిని నమ్ముకున్న కౌలు రైతులు, వ్యవసాయ కూలీల పేర్లు రికార్డుల్లోకి రావు.
  8. 100 ఎకరాలు అవసరమైన చోట ప్రభుత్వాలు ఏకపక్షంగా 1000 ఎకరాలు సేకరించే ప్రమాదం ఉంది (SIA వ్యవస్థ లేకపోతే—100 ఎకరాలు సరిపోయే ప్రాజెక్టు కోసం ప్రభుత్వాలు ఏకపక్షంగా 1000 ఎకరాలు సేకరించే ప్రమాదం ఉంది).
  9. బహుళ పంటలు పండే భూములను రక్షించే నిబంధనలు గాలికి ఎగిరిపోయి, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం వ్యవసాయ భూములు పంచబడతాయి.

ప్రభుత్వం అంటే బ్రహ్మపదార్థం కాదు – ప్రజాస్వామ్యంలో పౌరుడే ప్రభువు!

ఇప్పటివరకు చాలామంది పౌరులు ‘ప్రభుత్వం’ అంటే తమకు అందుబాటులో లేని ఒక బ్రహ్మపదార్థమని, దాని ఆదేశాలను ఎదుర్కోలేమని భావిస్తుంటారు. కానీ ప్రజాస్వామిక వ్యవస్థలో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఒక్కటే—మనం వేసిన ఓట్ల చేత, మన చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల సమూహమే ప్రభుత్వం! ప్రజల సంక్షేమం కోసం, హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో పనిచేసే ఒక ప్రతినిధి మాత్రమే తప్ప, ప్రభుత్వం రాజ్యాంగానికి లేదా పౌరుల హక్కులకు అతీతమైన అధిపతి కాదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజల జీవనోపాధిపైనే దెబ్బకొట్టేలా, చట్టాల్లోని లొసుగులతో భూములను లాక్కునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు.

అందుకే ప్రజలారా… ఓటు వేసేటప్పుడు మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలి! ఏ రాజకీయ నాయకుడైతే మన ఆశయాలకు, రాజ్యాంగబద్ధమైన హక్కులకు తూట్లు పొడవకుండా రక్షణగా నిలబడగలడో, అటువంటి నాయకులనే ఎంచుకోవడం మనందరి ముందున్న ప్రథమ కర్తవ్యం.

ఎన్నికల వేళ లభించే తాత్కాలిక తైలాలు ఇచ్చాడనో, లేదా వ్యక్తిగతంగా ఏదో చిన్న సాయం చేశాడనో చూసి నాయకులను ఎన్నుకుంటే—వారు అధికారంలోకి వచ్చాక పౌరుల నోళ్లు నొక్కే ఇటువంటి లొసుగుల చట్టాలను తెచ్చి, మన భవిష్యత్తును తీవ్ర నష్టానికి గురిచేస్తారు. ఈ చేదు నిజాలను గ్రహించి పౌరులు ఇప్పటికైనా మేల్కోవాలి! మనకు ఎటువంటి ప్రజానుకూల చట్టాలు కావాలో, మన హక్కులకు భంగం వాటిల్లకుండా ఎలాంటి రక్షణలు ఉండాలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలోనే పెట్టించేలా డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక గుర్తుపై వేసే ముద్ర కాదు; అది మన హక్కులను, తరతరాల ఆస్తిని కాపాడుకునే ఆయుధం!

Version 1

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Blog
error: Content is protected Contact Vinay Kumar Gattu !!