ప్రజలను చైతన్య పరిచే వ్యూహకర్తలు సమాజానికి అవసరం
ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలకు మనుగడ కష్టసాధ్యమైనపుడు, ప్రజల ఆదరాభిమానాలు పొందలేము అన్న స్థితిలో రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకుని మరొకమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాయి.
అసలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలు ఎందుకు? ప్రజలే ఎజెండాగా, ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు వెళితే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు ఆమోదిస్తారు, తన భుజాన వేసుకుని సునాయాసంగా గెలుపు గుర్రాన్ని ఎక్కిస్తారు… భారతదేశ 75 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీలు అయితే ప్రజల పక్షాన నిలబడతాయని, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చి, ప్రజలను కంటికి రెప్పలా కాపాడతాయని భావించారో వాటిని మాత్రమే ప్రజాక్షేత్రంలో తిరుగులేని రాజకీయ శక్తులుగా ప్రజలు నిలబెట్టుకున్నారు. కానీ ప్రస్తుత రాజకీయాలు అందుకు భిన్నంగా ఉండడమే రాజకీయ వ్యూహకర్తల పుట్టుకకు కారణం అవుతుంది.
రాజకీయ వ్యూహకర్తలు రాజకీయ పార్టీల వైపు కాకుండా ప్రజలను చైతన్య పరిచే దిశగా ఆలోచిస్తే దేశంలోనూ మరియు రాష్ట్రాలలోనూ సుపరిపాలనను అందజేసే రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నుకోగలుగుతారు… ఒక విజ్ఞానవంతుడైన వ్యూహకర్త ఉండాల్సింది ప్రజల పక్షాన… సామాన్య ప్రజలకు ఎటువంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలో, రాజ్యాంగ పరంగా వచ్చిన ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకునే దిశగా ఎలా అడుగులు వేయాలో తెలియజేయాలి.
సామాన్య ప్రజలు ఎప్పుడైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను తమకు తాముగా సునాయాసంగా పొందగలుగుతారు, ఆరోజు నవ భారతావనికి నాంది పడటం తప్పదు. అంతవరకూ సామాన్య ప్రజల పక్షాన పోరాడుదాం, నవ సమాజ భారతావనిని నిర్మిద్దాం.
జై భారత్
వినయ్ కుమార్ గట్టు
హై కోర్ట్ అడ్వకేట్ – తెలంగాణ.
Comment (1)
వినయ్ మీ విశ్లేషణ వంద శాతం నిజం. మన రాజకీయ పార్టీలు నాయకులు ప్రజలకు దూరమైనప్పుడే ఇలా వ్యూహా కర్తలను ఆశ్రయించాల్సి వస్తుంది. మేధావులనుకునేవారు కూడా ప్రజల పక్షాన ఉండకుండా ప్రజలను మోసం చేయడానికి సలహాలు ఇవ్వడానికి అమ్ముడుపోవడం శోచనీయం.