మార్పుకు నాంది విద్య
సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవన ప్రయాణంలో చుట్టూ జరుగుతున్న ధర్మ విరుద్ధమైన కొన్ని సంఘటనలను మరియు సమస్యలను చూస్తూ సమాజం మారితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. కానీ, సమాజం మారాలి అన్నంత మాత్రాన మార్పు సాధ్యం కాదు, మార్పునకు నీ వంతుగా సహాయం చేయాలి…
ఈ మాట చెప్పగానే చాలామంది “నేనేం చేయాలి? అయినా నేనేం చేయగలను? నేను ఒక్కడినే మారిస్తే మారిపోతుందా? ఏ ఇది ఇంతే మనుషులు మారరు నాకెందుకులే” అని అనుకొని తనకు తాను నచ్చ చెప్పుకుని మార్పుకి ముగింపు పలికి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరు ఏదో క్షణంలో ఏదో ఒక సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు మార్పు రావాలనుకోవడం, సమస్య తీరగానే మనకెందుకులే అని వదిలేయడం ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటుంది.
మార్పు రావాలనుకుంటే అది ఒక విద్య వల్లనే సాధ్యమవుతుంది. మానవుని జీవితంలో ప్రతి సంఘటన, ప్రతి సమస్య విద్యతోనే ముడిపడి ఉంటుంది.
ఉదాహరణకి మనం ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కలవాలి? ఏ విధంగా సహాయం పొందాలి? అసలు మనకు వచ్చిన జబ్బు నిజమా కాదా? అని అనేకమైన విషయాలు తెలుసుకోవాలన్నా విద్య అవసరం. విద్య వల్లనే విజ్ఞానం వస్తుంది, ఆ విజ్ఞానమే మనం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
కావాలంటే మీరు మీ మీ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు గుర్తు చేసుకోండి, ప్రతి విషయం ఏదో రకంగా విద్యకే ముడిపడి ఉంటుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం.
మనకు తెలిసిన జ్ఞానాన్ని లేదా విషయాలను పది మందితో సరైన రీతిలో పంచుకోవడం ద్వారా మార్పునకు నాంది వేసిన వారం అవుతాం. మార్పు అనేది ఏ ఒక్క రాత్రిలోనూ వచ్చేది కాదు. మార్పు అంటే మానవుడు ఉన్నంతవరకు మానవ పరిణామ క్రమంలో రోజువారి చర్య.
మనకు తెలిసిన విషయాలను మన చుట్టూ ఉన్న సమాజంతో పంచుకుందాం, మార్పునకు మూలం అవుదాం.
జై భారత్
వినయ్ కుమార్ గట్టు
Leave a Reply